: తృణమూల్ ఎంపీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ ఈరోజు లోక్ సభలో డిమాండ్ చేసింది. ఇందుకు ఆయన తిరస్కరించడంతో, క్షమాపణ చెప్పకపోతే అభిశంసన తీర్మానం ప్రవేశపెడతామని స్పష్టం చేసింది. అటు, కల్యాణ్ బెనర్జీపై తీర్మానం ప్రవేశపెడితే మద్దతిస్తామని సీపీఎం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, క్షమాపణలు చెప్పమని ఒత్తిడి చేయవద్దన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిని గుర్తెరగాలని సూచించారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లోని ఓ బహిరంగ సభలో బెనర్జీ మాట్లాడుతూ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిపైనా, ఆయన మనవడు, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పైనా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలోనూ ఆ వ్యాఖ్యలను కేంద్రం ఖండించింది. అటు, రాజ్యసభ ఛైర్మన్ మాట్లాడుతూ, ఎవరు అభ్యంతరకరంగా మాట్లాడినా ఆమోదయోగ్యం కాదని అన్నారు.