: మీ ప్రమేయం లేకుండానే ఎస్సెమ్మెస్ లు వెళ్లిపోతాయి!
టెక్నాలజీకి వైరస్ లు సవాళ్లు విసురుతున్నాయి. తాజాగా, ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లకు సరికొత్త ట్రోజన్ వైరస్ ముప్పు పొంచి ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ దాడికి గురైన ఫోన్ల నుంచి యూజర్ల ప్రమేయం లేకుండానే ఎస్సెమ్మెస్ లు వెళతాయని తెలిపారు. పాస్ వర్డ్ లు, విలువైన సమాచారాన్ని ఈ వైరస్ తస్కరిస్తుందని వివరించారు. ఈ వైరస్ కు 'ఆండ్రాయిడ్ ఎస్సెమ్మెస్ సెండ్' గా నామకరణం చేశారు. ఆండ్రాయిడ్ యాప్ ల మాటున ఇది ఫోన్లలోకి చొరబడుతుందట. ఒక్కసారి ఇది ప్రవేశించిన తర్వాత మొబైల్ ఫోన్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుందని, కాంటాక్ట్ లిస్టులోని నెంబర్లకు మనకు తెలియకుండానే మెసేజ్ లు వెళతాయని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సీఈఆర్టీ-ఇన్) పేర్కొంది. ఈ మేరకు దేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లకు సూచనలు చేసింది. విశ్వసనీయం కాని సోర్స్ నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేసుకోరాదని, ఇన్ స్టాల్ చేసుకునే ముందు అన్ని అంశాలు పరిశీలించుకోవాలని తెలిపింది. డివైస్ ఎన్ క్రిప్షన్ ఉపయోగించాలని సూచించింది. గుర్తు తెలియని వై-ఫై నెట్ వర్క్ లకు దూరంగా ఉండాలని పేర్కొంది.