: పవన్ కల్యాణ్ బాటలో బాలకృష్ణ
ఖమ్మం పట్టణంలో ట్యూమర్ తో బాధపడుతున్న శ్రీజ అనే బాలికను హీరో పవన్ కల్యాణ్ పరామర్శించడం తెలిసిందే. తనకు పవన్ కల్యాణ్ ను చూడాలనుందని శ్రీజ పేర్కొనగా, మెగా హీరో వెంటనే స్పందించాడు. ఖమ్మం వెళ్లి ఆ చిన్నారితో కొంతసేపు గడిపాడు. ఆమెకు కానుకలు కూడా ఇచ్చాడు. ఇప్పుడా చిన్నారి కోలుకుని డిశ్చార్జి అయింది. అదే తరహాలో, నందమూరి బాలకృష్ణ కూడా శ్రావణి (12) అనే బాలికను సంతోషపెట్టాడు. నరసరావుపేటకు చెందిన ఈ బాలిక క్యాన్సర్ తో బాధపడుతోంది. ప్రస్తుతం హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇటీవలే కోమా నుండి బయటికి వచ్చిందట. తనకు బాలకృష్ణను చూడాలని ఉందని తల్లిదండ్రులతో పేర్కొంది. ఈ విషయం బాలయ్యకు చేరడంతో ఆయన సానుకూలంగా స్పందించాడు. బాలికను పరామర్శించి, సంతోషంలో ముంచెత్తాడు. ప్రస్తుతం శ్రావణి కోలుకుంటోందని డాక్టర్లు చెప్పారు.