: ఇన్స్యూరెన్స్ బిల్లుకు మార్గం సుగమం... మద్దతు పలకనున్న కాంగ్రెస్
దేశీయ బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచుతూ కేంద్రం ప్రతిపాదించిన బిల్లుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ప్రస్తుతం దేశీయ బీమా రంగంలో 26 శాతం మేర విదేశీ పెట్టుబడులకు మాత్రమే అవకాశం ఉంది. అయితే విదేశీ పెట్టుబడులను మరింత ప్రోత్సహించేందుకు నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. విదేశీ పెట్టుబడుల శాతాన్ని పెంచితే లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయన్న వాదనతో ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఇదిలా ఉంటే, రాజ్యసభ సెలెక్ట్ కమిటీ బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బిల్లుకు మద్దతు తెలపడమే మంచిదని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు సర్కారుకు స్పష్టమైన సంకేతాలు పంపింది. దీంతో బుధవారం పార్లమెంట్ ముందుకు రానున్న ఈ బిల్లుకు ఎలాంటి ఆటంకం లేకుండానే ఆమోదం లభించే అవకాశాలున్నాయి. సెలెక్ట్ కమిటీ చేసిన సిఫారసులపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హర్షం వ్యక్తం చేశారు.