: మేనిఫెస్టోలో లేకపోయినా ఎకరా పండ్లతోటకు 10 వేలు... రుణమాఫీ రెండో జాబితా తయారవుతోంది: బాబు
అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెల 10 నుంచి రుణమాఫీ ప్రారంభం అవుతుందని... 11 నుంచి 16వ తేదీ వరకు రైతు సాధికారిక సదస్సులు నిర్వహించనున్నామని వెల్లడించారు. సచివాలయం నుంచి మంత్రులు, జిల్లా స్థాయి అధికారులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరు నెలల పాలనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేనిఫెస్టోలో చెప్పకపోయినా పండ్లతోటలు ఉన్నవారికి ఎకరాకు రూ. 10 వేలు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి రెండు బ్యాంకు ఖాతాలు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. బ్యాంకుల ద్వారానే ప్రభుత్వ లబ్ధి అందేలా చూడాలని చెప్పారు. స్వయంసహాయక బృందాల నైపుణ్యాలను పెంచేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. అర్హులకు పింఛన్లు సక్రమంగా అందేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తామని... భూసార పరీక్షల నుంచి మార్కెటింగ్ వరకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలను బడికి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. రైతు సాధికారిక సదస్సులో ఖరీఫ్ సాగుపై గ్రామాల వారీగా సమీక్ష నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి, ప్రతి వీధిలో పబ్లిక్ టాయ్ లెట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ నేతలు, ఐఏఎస్ అధికారులు, ఎన్నారైలు, సీనీరంగ ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. రెండో విడత రైతు రుణమాఫీ జాబితా సిద్ధమవుతోందని వెల్లడించారు.