: నీరు, సూర్యరశ్మి... భవిష్యత్ ఇంధన ముడిసరుకులివే!
రానున్న కాలంలో ముడిచమురు నిల్వలు మరింతగా తరిగిపోతాయని, తద్వారా, మానవాళి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై పెద్ద ఎత్తున పరిశోధనలు కొనసాగుతున్నాయి. జీవ ఇంధనాలు, సోలార్ ఎనర్జీ... ఇలా, పర్యావరణానికి హాని కలిగించని శక్తి రూపాలపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. తాజాగా, నీరు, సూర్యరశ్మిని వినియోగించి ఇంధనం రూపొందించే దిశగా ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ బృందంలో భారత సంతతికి చెందిన డాక్టర్ కస్తూరి హింగోరాని కూడా ఉన్నారు. నీరు, సూర్యరశ్మి విస్తారంగా లభిస్తాయని, వాటి సాయంతో హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయడం ఆసక్తికరమైన పరిశోధన అని డాక్టర్ కస్తూరి వివరించారు. ఇది సురక్షితమైనది, చవకైనది అని తెలిపారు. అధికంగా కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే పెట్రోలియం ఉత్పత్తులతో పోల్చితే, హైడ్రోజన్ ఎంతో మేలైనదని అన్నారు. తమ పరిశోధనకు మొక్కల కిరణజన్య సంయోగ క్రియనే స్ఫూర్తి అని డాక్టర్ కస్తూరి పేర్కొన్నారు.