: హైదరాబాద్ శివారులో మరో రేవ్ పార్టీ గుట్టురట్టు... నిందితుల్లో ప్రముఖుల పిల్లలు!
హైదరాబాద్ శివారులో గుట్టుగా సాగుతున్న ఓ రేవ్ పార్టీని నగర పోలీసులు సోమవారం రాత్రి భగ్నం చేశారు. పక్కా సమాచారంతో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్ పై దాడి చేసిన పోలీసులు రేవ్ పార్టీలో మునిగిపోయిన దాదాపు 30 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఎనిమిది మంది ముంబైకి చెందిన యువతులతో పాటు 22 మంది యువకులున్నారు. వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్తల కుటుంబాలకు చెందిన వారు కూడా ఉన్నారని సమాచారం. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసులు ఈ రేవ్ పార్టీపై దాడి చేశారు. పార్టీలో భాగంగా యువతులు ముజ్రా డ్యాన్స్ ల పేరిట అశ్లీల నృత్యాలతో అలరిస్తున్నారు. దాడి సందర్భంగా మద్యం బాటిళ్లతో పాటు ఖరీదైన మొబైల్ ఫోన్లు, రూ.1.20 లక్షల నగదు, విలువైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని నేడు కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.