: పోలీసులకు లొంగిపోయిన జానకీరామ్ మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్
నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ మృతి కేసులో ట్రాక్టర్ డ్రైవర్ వెంకన్న పోలీసులకు లొంగిపోయాడు. నల్లగొండ జిల్లా ఆకుపాముల గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకిరామ్ (42) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై ట్రాక్టర్ డ్రైవర్ వెంకన్నపై కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలం కోనాయిగూడానికి చెందిన రైతు వెంకన్న ఆకుపాముల జాతీయ రహదారి పక్కన సాగు చేసిన వరినారును తీసుకెళ్లడానికి సొంత ట్రాక్టర్ పై వచ్చాడు. దూరం తగ్గుతుందనే కారణంతో వరినారు తీసుకొని స్వగ్రామానికి వెళ్లేందుకు ఆకుపాముల శివారులో రాంగ్ రూట్ లో ట్రాక్టర్ ను యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న జానకిరామ్ టాటా సఫారీ వాహనం ఢీ కొట్టింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ వెంకన్న మునగాల పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.