: బీ అలెర్ట్... ప్రమాదం పొంచి ఉంది!: ఇంటెలిజెన్స్ బ్యూరో
పెను ప్రమాదం పొంచి ఉంది, అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. 2013లో మధ్యప్రదేశ్ జైలు నుంచి పారిపోయిన ఐదుగురు సిమి ఉగ్రవాదులు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు మనదేశంలో భారీ దాడులకు కుట్ర పన్నుతున్నట్లు ఐబీ స్పష్టం చేసింది. దీంతో అన్ని రాష్ట్రాలకు హై ఎలర్ట్ పంపింది. మహ్మద్ ఐజాజుద్దీన్, మహ్మద్ అస్లాం, అమ్జాద్ ఖాన్, జాకిర్ హుస్సేన్ సాదిక్, మహబూబ్ గుడ్డులకు ఉగ్రదాడులు చేసే బాధ్యతను ఐఎస్ఐ అప్పగించినట్లు ఐబీ వర్గాలు వెల్లడించాయి. వీరు ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని, వారు ఈ రాష్ట్రాల్లో దాగి ఉండే అవకాశం ఉందని ఐబీ అనుమానిస్తోంది. ఐఎస్ఐ హ్యాండ్లర్లు పంపిన ఓ సందేశాన్ని భారత నిఘా వర్గాలు అడ్డుకున్నాయి. అందులో ''వాళ్లకు మంచి ప్రాజెక్టు ఇచ్చాం. కొన్ని రోజులు వేచి చూడు'' అని ఉంది. చిట్టచివరి సారిగా ఈ ఐదుగురు కర్ణాటకలో ఉన్నట్లు తెలిసింది. వీళ్ల గ్యాంగ్ లీడర్ ఫైజల్ తో కలిసి ఈ ఐదుగురు 2013 అక్టోబర్ 1వ తేదీన మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జైలు నుంచి 14 అడుగుల ఎత్తున్న గోడ దూకి పారిపోయారు. వీళ్లు కొంతకాలం తెలంగాణ, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలిసింది. కరీంనగర్ లో ఫిబ్రవరి 1న జరిగిన బ్యాంకు దోపిడీలో కూడా వీళ్ల పాత్ర ఉందని అనుమానం వ్యక్తమైంది.