: జనవరి 1 నుంచి ఉచిత లావాదేవీలు ఐదు మాత్రమే: ఐసీఐసీఐ
రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా అనుమతులను అనుసరించి నెలలో ఏటీఎం ఉచిత లావాదేవీలను ఐదుకు పరిమితం చేయనున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించింది. ఆపై ఏటీఎంల నుంచి జరిగే ప్రతి నగదు లావాదేవీకి రూ.20 వసూలు చేస్తామని తెలిపింది. మారిన విధానాన్ని జనవరి 1 నుంచి అమలు చేస్తామని వెల్లడించింది. పొదుపు ఖాతాదారులకు ఏటీఎంలలో 5 లావాదేవీల తర్వాత రూ.20 రుసుము వసూలు చేయనున్నట్లు ఆ బ్యాంకు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. మెట్రో ప్రాంతాల్లో తమ ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో 3 ఉచిత లావాదేవీలు, ఇతర ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. పరిమితి దాటిన తరువాత ఏ బ్యాంకు ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసినా రూ.20, బ్యాలెన్స్, మినీ స్టేట్ మెంట్ వంటి వాటికి రూ.8.50 వసూలు చేస్తామని తెలిపింది. ఏటీఎంల నిర్వహణ భారమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.