: దిలీప్ కుమార్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: అమీర్ ఖాన్
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు నటుడు అమీర్ ఖాన్ తెలిపాడు. మరోసారి అనారోగ్యంపాలై ముంబయిలోని ఓ ఆసుపత్రిలో న్యూమోనియాకు ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ మేరకు అమీర్ వారణాసిలో మాట్లాడుతూ, "దిలీప్ కుమార్ ఆరోగ్యం సరిగాలేదని నేను కూడా టీవీలో చూశా. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. అందుకే త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తాం. యూసఫ్ (దిలీప్ అసలు పేరు) సాహెబ్ కు నేను పెద్ద అభిమానిని. ఆయన సినిమాలు చూసి చాలా నేర్చుకున్నా. భారతీయ నటులపై ఆయన ప్రభావం చాలా వరకు ఉంటుంది" అని అన్నారు. మరోవైపు దిలీప్ ఆరోగ్యం నిలకడగా ఉందని, నెమ్మదిగా కోలుకుంటున్నారని దిలీప్ కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చినట్టు వివరించారు.