: పోలీస్ వర్సెస్ పొలిటీషియన్: కర్నూలులో నిలిచిన సీఐల బదిలీలు
కర్నూలు జిల్లాలో మరోమారు పోలీసు అధికారులతో రాజకీయ నేతలు విభేదించారు. ఏళ్లుగా జిల్లాలో రాజకీయ ఆధిపత్యం కోసం తమకు అనుకూలమైన పోలీసు అధికారులను నియమించుకునేందుకు జిల్లా నేతలు అధిక ప్రాధాన్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో పలువురు పోలీసు అధికారులను వివిధ సందర్భాల్లో అధికార పార్టీలుగా కొనసాగిన కాంగ్రెస్, టీడీపీ నేతలు బదిలీ చేయించారు. రాజకీయ నేతలపై ఇటీవల జిల్లా ఎస్పీగా పనిచేసిన రఘురామిరెడ్డి సమరశంఖం పూరించడంతో పాటు వారి వ్యవహారంపై కోర్టుకెక్కి మరీ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఇరువర్గాల మధ్య అభిప్రాయభేదాలు పొడచూపాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా జరగాల్సిన సీఐల బదిలీలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. తమపై సీఎంకు ఫిర్యాదు చేసిన రాజకీయ నేతల వైఖరిని నిరసిస్తూ జిల్లా ఎస్పీ రవికృష్ణ సహా సీనియర్ పోలీసు అధికారులు సెలవులో వెళ్లారు. సెలవులో వెళ్లిన పోలీసు బాసులు తిరిగివస్తే కాని తమ బదిలీల్లో కదలిక ఉండదని సీఐలు ఎదురుచూస్తున్నారు.