: ప్రణాళిక సంఘ సంస్కరణలపై దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తమైంది: జైట్లీ
ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం ముగిసిన అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీఎంతో సమావేశానికి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చారని తెలిపారు. కాశ్మీర్, ఝార్ఖండ్ సీఎంలు ఎన్నికల కారణంగా గైర్హాజరయ్యారని వివరించారు. సీఎంల సమావేశంలో ప్రధానంగా ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త వ్యవస్థ ఏర్పాటుపై చర్చ జరిగిందని జైట్లీ వెల్లడించారు. నూతన వ్యవస్థను ప్రధాని మోదీ ప్రతిపాదించారని, దీనికి సమ్మతిస్తూ దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తమైందని చెప్పారు. కొత్త వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉండాలని కొందరు సీఎంలు సూచించారని తెలిపారు. అధికారం, ప్రణాళికలను వికేంద్రీకరించాలని రాష్ట్రాలు కోరాయని చెప్పారు. ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటయ్యే నూతన వ్యవస్థపై మూడు బృందాలు ఉంటాయన్నారు. తొలి బృందంలో ప్రధాని, ముఖ్యమంత్రులు... రెండో బృందంలో ప్రధాని, మంత్రివర్గం... మూడో బృందంలో ప్రధాని, ఉన్నతాధికారులు ఉంటారని ఆర్థిక మంత్రి వివరించారు. 1950లో ప్రణాళిక సంఘం ఏర్పడిందని, 1992లో దేశంలో సంస్కరణలు మొదలయ్యాయని జైట్లీ పేర్కొన్నారు. దేశానికి మరిన్ని ప్రణాళికలు అవసరమని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.