: చల్లపల్లిలో గురురూప రాక్షసులు... విద్యార్థినిపై సుదీర్ఘకాలంగా లైంగిక దాడి


కృష్ణ జిల్లా చల్లపల్లి పరిధిలో గురురూప రాక్షసుల ఘాతుకం వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వక్కలగడ్డ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివరాం ప్రసాద్, మరో ఉపాధ్యాయుడు జనార్ధన్ ప్రసాద్ లు ఓ విద్యార్థినిపై చాలాకాలం పాటు లైంగిక దాడికి పాల్పడటమే కాక, సదరు విద్యార్థి అకాల మృతికి కారణమయ్యారు. తమ లైంగిక దాడి నేపథ్యంలో మూడు సార్లు గర్భం దాల్చిన విద్యార్థినికి వారు అబార్షన్ చేయించారు. పిన్న వయసులోనే మూడుసార్లు అబార్షన్ కావడంతో ఆ బాలిక 15 రోజుల క్రితం మృత్యువాత పడింది. అయితే, ఈ విషయం బయటకు పొక్కకుండా సదరు రాక్షసులు జాగ్రత్తలు తీసుకున్నారు. మూడు రోజుల క్రితం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి ఆదివారం పోలీసులు ఇద్దరు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని మృతికి కారణమైన వారిద్దరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో, చిన్న పిల్లలపై అకృత్యాలకు పాల్పడ్డ వారిపై నిర్భయ చట్టం కింద రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది. ఇక, వారి ప్రోద్బలంతో బాలికకు అబార్షన్ చేసిన వైద్యశాలపైనా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఇదిలా ఉండగా, విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టిన ప్రధానోపాధ్యాయుడు శివరాంప్రసాద్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా జాతీయ స్థాయిలో రాష్ట్రపతి నుంచి అవార్డు పొందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతని అవార్డును ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News