: భీమవరం మండలంలో ఇంటికి నిప్పంటుకుని నలుగురు సజీవ దహం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటికి నిప్పంటుకున్న ప్రమాదంలో ఇంటిలో నిద్రిస్తున్న నలుగురు సభ్యుల కుటుంబం మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. మృతుల్లో భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు కొడుకులున్నారు. చనిపోయిన వారిని ప్రకాశ్, రాజమణి, దేవరాజ్, వంశీలుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నికి బూడిదైన ఇంటి సమీపంలో ఖాళీ పెట్రోల్ డబ్బాలను కనుగొన్నారు. దీంతో ఈ ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటిపై పెట్రోల్ పోసిన దుండగులు వారిని హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు. కుటుంబ యజమాని ప్రకాశ్ గల్ఫ్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు.