: సీటు బెల్టు పెట్టుకోని కారణంగానే జానకీరామ్ మృతి
సినీ నటుడు, మాజీ ఎంపీ హరికృష్ణ కుమారుడు జానకీరామ్ సీటు బెల్టు పెట్టుకోని కారణంగానే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డట్లు వైద్యులు ధ్రువీకరించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న క్రమంలో నల్లగొండ జిల్లా ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకీరామ్ మరణించిన సంగతి తెలిసిందే. జానకీరామ్ మృతదేహానికి శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో భాగంగా గుండె భాగానికి బలమైన గాయం కారణంగానే జానకీ రామ్ మృత్యువాతపడ్డారని వైద్యులు నిర్ధారించారు. గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు చిట్లిపోయాయని, ఈ కారణంగానే ఆస్పత్రికి తరలించేలోగానే ఆయన చనిపోయారని తేల్చారు. సీటు బెల్టు పెట్టుకోని కారణంగానే ప్రమాద సమయంలో జానకీరామ్ ఛాతీ భాగం కారు స్టీరింగ్ కు బలంగా ఢీకొట్టిందని, ఈ నేపథ్యంలో రక్త నాళాలు చిట్లిపోయాయని తేల్చారు.