: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ సభకు రెండు ప్రత్యేక రైళ్లను పంపిన నవాజ్ షరీఫ్
పాక్ ప్రభుత్వం, ఐఎస్ఐ అండతో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కరడుగట్టిన ఉగ్రవాది, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ మరోసారి భారత్ మీద అక్కసును వెళ్లగక్కాడు. కాశ్మీర్ ప్రజల స్వాతంత్ర్యం కోసం పాకిస్థానీలు కృషి చేయాలని పిలుపునిచ్చాడు. "ఆఫ్ఘనిస్థాన్ లోని అమెరికా బలగాలకు తోడ్పడేందుకు ఇండియా తన సైన్యాన్ని పంపిస్తున్నప్పుడు... కాశ్మీర్ లోని మన సోదరులకు సహాయం చేసేందుకు ముజాహిదీన్ లు కాశ్మీర్ కు వెళ్లడంలో తప్పులేదు. జీహాదీలకు కాశ్మీర్ వెళ్లే హక్కు ఉంది. కాశ్మీరీల పిలుపు మేరకు అక్కడకు వెళ్లాల్సిన బాధ్యత మనకు ఉంది" అంటూ పాకిస్థానీల మదిలో భారత్ వ్యతిరేక భావజాలాన్ని నింపే ప్రయత్నం చేశాడు. లాహోర్ లోని చరిత్రాత్మక ప్రాంతమైన మినార్-ఏ-పాకిస్థాన్ మైదానంలో జరుగుతున్న జమాత్ ఉద్ దవా సభలో ప్రసంగిస్తూ సయీద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, అనుచరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సయీద్ మాట్లాడుతూ, ప్రేమను పంచాలనుకుంటున్న మన మాటలను ఇండియా వినకపోతే... కాశ్మీర్ ప్రజలు స్వాతంత్ర్యం పొందేందుకు పూర్తిగా సహకరించాలని ప్రధాని నవాజ్ షరీఫ్ కు చెబుతామని అన్నాడు. మరో దారుణ విషయం ఏమిటంటే, ఈ కార్యక్రమానికి జనాలను తరలించడం కోసం నవాజ్ షరీఫ్ ప్రభుత్వం రెండు ప్రత్యేక రైళ్లను నడిపిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ ను అమెరికా, ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాయి. ఇందులో భాగంగా సయీద్ తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతిని కూడా ప్రకటించింది. సయీద్ ను అరెస్ట్ చేయాలంటూ పాక్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ పరిస్థితుల్లో కూడా, సయీద్ పాక్ వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణిస్తూ, బహిరంగ సభలను కూడా నిర్వహిస్తుండటం ఆందోళన కలిగించే అంశం.