: గ్రేహౌండ్స్ మాజీ బాస్ కు సీఆర్పీఎఫ్ బాధ్యతలు... మావోల నిర్మూలనే లక్ష్యం


ఉత్తరాది రాష్ట్రాల్లో నానాటికీ బలోపేతమవుతున్న మావోయిస్టులను అణచివేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. మావోలను సమూలంగా నిర్మూలించడంలో గడచిన పదేళ్లలో ఏపీలో గణనీయ ఫలితాలు నమోదయ్యాయి. ఇందులో, ఏపీలో ప్రత్యేకంగా రూపొందించిన గ్రేహౌండ్స్ విభాగం కీలక భూమిక పోషించిందనే చెప్పాలి. ఈ విభాగాన్ని అత్యంత ఉన్నతంగా తీర్చిదిద్దిన ఘనత మాత్రం ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి దుర్గాప్రసాద్ కే దక్కుతుంది. మొన్నటిదాకా ప్రధాని భద్రతా విభాగం ఎస్పీజీ చీఫ్ గా కొనసాగిన దుర్గాప్రసాద్ ను అక్కడి నుంచి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లా పరిధిలో మావోల దాడిలో సీఆర్పీఎఫ్ కు చెందిన 14 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో, మావోయిస్టులను ఏరివేయడమే కాక సీఆర్పీఎఫ్ ను మరింత బలోపేతం చేసే బాధ్యతలను దుర్గాప్రసాద్ కు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేహౌండ్స్ ను దుర్గాప్రసాద్ తీర్చిదిద్దిన వైనాన్ని హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొనియాడారట. దుర్గాప్రసాద్ అయితేనే మావోలను సమర్ధవంతంగా ఎదుర్కోగలరని కూడా ఆయన భావిస్తున్నారు. రాజ్ నాథ్ సూచనల మేరకే కేంద్రం ఆయనను సీఆర్పీఎఫ్ డీజీగా నియమించింది.

  • Loading...

More Telugu News