: కాలేజీలో అడ్మిషన్ల కోసం అందమైన భామలు, డాన్సర్లు... అమెరికా కాలేజ్ నిర్వాకం
ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు పొందాలంటే ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకోవాలని భావిస్తూ, అడ్మిషన్ అధికారులుగా అందమైన భామలను, బార్ డాన్సర్లనూ ఏరికోరి నియమించిందో అమెరికా కాలేజ్. తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి, ముందుగా తర్ఫీదు ఇచ్చిన విద్యార్థులతో అబద్ధాలు చెప్పించి మిలియన్ ల కొద్దీ ప్రభుత్వ ధనాన్ని అప్పనంగా తీసుకుంది. ఫ్లోరిడాలోని ఫాస్ట్ ట్రైన్ కాలేజి చేస్తున్న ఈ నిర్వాకాన్ని గుర్తించిన అధికారులు మియామీ కోర్టులో కేసు వేశారు. అందంగా ఉన్న యువతులను నియమించి, వారు రెచ్చగొట్టేలా వుండే దుస్తులను ధరించేలా చూసి కాలేజిలో ప్రవేశాలకు వచ్చే విద్యార్థులు మరో వైపు చూడకుండా చేయాలన్నది ఫాస్ట్ ట్రైన్ కాలేజి యాజమాన్యం భావన. నిబంధనల మేరకు ఓ విద్యార్థి కనీసం 30 రోజుల పాటు కాలేజికి హాజరైతేనే, ప్రభుత్వ నిధులు వస్తాయి. విద్యార్థులను కాలేజికి రప్పించేందుకు ఇలా నానా పాట్లూ పడ్డ ఫాస్ట్ ట్రైన్ కాలేజి చివరకు దొంగ విద్యార్థులను కూడా చూపిందట. అభియోగాలను నమోదు చేసిన కోర్టు అటు సివిల్, ఇటు క్రిమినల్ కేసుల్లో విచారణ ప్రారంభించింది. ఈ తరహాలో లాభాల కోసం కష్టపడుతున్న కాలేజీలు ఫ్లోరిడా ప్రాంతంలో ఇంకా చాలానే ఉన్నాయట!