: డీసీ ప్రకటనలు కాపీ కొట్టిన టైమ్స్ అఫ్ ఇండియా... విచారణకు ఆదేశించిన కోర్టు
ఉచితంగా ప్రకటనలు వేసే పత్రిక ఎక్కడైనా ఉంటుందా? మీరు ఒక పేపర్ కు ప్రకటన ఇస్తే, అది మరో పేపర్లో, అందునా ఓ ప్రముఖ జాతీయ దినపత్రికలో వస్తే ఆనందమే కదా? ఇంతకీ విషయం ఏమిటంటే... డెక్కన్ క్రానికల్ కు ప్రకటనకర్తలు ఇచ్చిన క్లాసిఫైడ్స్ కొన్ని రోజుల తరువాత టైమ్స్ అఫ్ ఇండియాలో కనిపిస్తున్నాయి. టైమ్స్ పత్రిక తమ ప్రకటనలను 'లిఫ్ట్' చేసి అవి ఇచ్చిన వారికి కూడా తెలియకుండా ప్రచురిస్తుందనే విషయం ‘డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్’ గుర్తించింది. ఈ మేరకు సాక్ష్యాధారాలతో విషయమంతా కోర్టు ముందు ఉంచింది. కోర్టు దీన్ని శిక్షార్హమైన నేరంగా గుర్తించి ఒక పద్ధతి ప్రకారం డక్కన్ క్రానికల్ పేజీల్లోంచి క్లాసిఫైడ్ యాడ్స్‌ను తస్కరించడంపై దర్యాప్తు చేయమని పోలీసులను ఆదేశించింది. భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 120బి, 379, 467 సెక్షన్ల కింద పత్రికపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయంలో టైమ్స్ ఇంకా స్పందించలేదు.