: డిజిన్వెస్ట్ మెంట్ కు నేడు కేంద్రం శ్రీకారం
ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన వాటాను విక్రయించేందుకు సుదీర్ఘకాలంగా శ్రమిస్తున్న కేంద్రం నేడు తొలి అడుగు వేయనుంది. ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్)లోని తన 5 శాతం వాటాను విక్రయించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసుకుంది. నేడు ఇందుకు సంబంధించిన విక్రయాలు ప్రారంభం కానున్నాయి. తొలి విడత డిజిన్వెస్ట్ మెంట్ లోనే రూ.1,700 కోట్ల మేర నిధులను పోగేసుకునేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఒక్కో షేరును రూ.83 లకు విక్రయించనున్న కేంద్రం, రిటెయిల్ కొనుగోలుదారులకు 5 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన పెట్టుబడులను విక్రయించడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.43,425 కోట్లను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నేడు విక్రయానికి రానున్న 5 శాతం వాటాలోని 20.65 కోట్ల సెయిల్ షేర్లను విక్రయించనున్న కేంద్రం రూ.1,700 కోట్లను పోగేయడం పెద్ద కష్టమేమీ కాదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.