: టీమిండియా సీనియర్ల కథ ముగిసినట్టే!
కొన్నేళ్ల క్రితం వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లేని భారత జట్టును ఊహించుకోలేకపోయేవాళ్ళం! ముఖ్యంగా, వన్డే ఫార్మాట్లో వీళ్లు జట్టుకు విశేషంగా సహకరించేవారు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. జూనియర్లు ప్రతిభ చాటుకుంటూ టీమిండియాలో పాగా వేశారు. దీంతో, గత కొంతకాలంగా వీరు ఎదురుచూపులతోనే సరిపెట్టుకుంటున్నారు. తాజాగా, వరల్డ్ కప్ ప్రాబబుల్స్ ఎంపిక సందర్భంగా, సెలక్టర్లు మొండిచేయి చూపడంతో వీరి ఆశలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడినట్టయింది. ఈ నేపథ్యంలో, సీనియర్ ఆటగాళ్లు ఇక రిటైర్మెంటుకు సిద్ధం కాక తప్పదని క్రికెట్ పండితులంటున్నారు. ముఖ్యంగా, యువ క్రికెటర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, వరుణ్ ఆరోన్ తదితరులు విదేశీగడ్డపై కూడా రాణించడం ద్వారా తమ స్థానాలను పదిలపరుచుకున్నారు. పిచ్ ఎలాంటిదైనా తనకు సంబంధం లేదన్నట్టు ఆడే విరాట్ కోహ్లీ టాపార్డర్ లో విలువైన ఆటగాడిగా ఎదిగాడు. ఈ నేపథ్యంలో, సీనియర్లు విశేష ప్రదర్శన కనబరిస్తేనే జట్టులోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వయసు పైబడడం, గాయాలు సెహ్వాగ్, జహీర్, యువరాజ్ తదితరుల కెరీర్ కు ప్రతిబంధకంగా మారాయి. దేశవాళీ పోటీల్లో రాణించకపోవడం వీరికి ప్రతికూలంగా మారింది. దీంతో, సెలక్టర్లు వీరిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. వరల్డ్ కప్ చాన్సు మిస్సవడంతో, ఇక గౌరవప్రదంగా రిటైరయ్యేందుకు యత్నిస్తారనడంలో సందేహం లేదు. అందుకు అనుగుణంగానే బీసీసీఐ కూడా వరల్డ్ కప్ అనంతరం వీరిని టెస్టు జట్టులోకి తీసుకుని సగౌరవంగా సాగనంపే ఏర్పాట్లు చేస్తుందని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.