: రేడియో మిర్చిలో పాటలు పాడిన కేజ్రీవాల్
అవినీతిని ఊడ్చిపారేస్తామన్న నినాదంతో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి అనతికాలంలోనే పాప్యులర్ అయిన నేత అరవింద్ కేజ్రీవాల్. ప్రజలతో మమేకం కావడానికి ఎక్కువగా ఇష్టపడే కేజ్రీ తాజాగా పాటలు పాడడం విశేషం. ఇదంతా ఓటర్లను ఆకర్షించేందుకే. త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో, పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి సారించాయి. ఇప్పటికే నిధుల సేకరణ నిమిత్తం విందులు నిర్వహిస్తున్న కేజ్రీవాల్... ఈ మారు కాస్త విలక్షణంగా, నోయిడాలో ఉన్న రేడియో మిర్చి ఎఫ్ఎం రేడియో స్టేషన్ కు వెళ్లారు. అక్కడ పలు హిట్ గీతాలు ఆలపించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయన పాడిన పాటల్లో బాలీవుడ్ క్లాసిక్ సినిమా 'కల్ ఆజ్ ఔర్ కల్' గీతాలు కూడా ఉన్నాయి. కేజ్రీ గాత్ర ప్రతిభకు రేడియో మిర్చి ఆర్జేలు కరతాళ ధ్వనులతో అభినందించారట.