: ప్రణబ్ బుక్ పై ఆన్ లైన్, ఆఫ్ లైన్ విక్రయిదారుల మధ్య వివాదం!
మొబైల్ ఫోన్ల విక్రయాలపై ఇప్పటికే ఆన్ లైన్, రిటెయిల్ విక్రయదారుల మధ్య కొనసాగుతున్న వివాదానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పుస్తకం ఆజ్యం పోస్తోంది. ‘ద డ్రమటిక్ డికేడ్: ద ఇందిరా గాంధీ ఇయర్స్’ పేరిట ప్రణబ్ రాసిన పుస్తకం ఈ నెల 11న మార్కెట్ లోకి రానుంది. ఈ ఏడాది అత్యుత్తమ బుక్ గా రికార్డులకెక్కుతుందని భావిస్తున్న ఈ పుస్తకం, విడుదలైన వెంటనే బుక్ స్టోర్లలో కనిపించదట. పుస్తక ముద్రణ సంస్థ రూపా, ప్రపంచ ఈ-టెయిలింట్ దిగ్గజం అమెజాన్.కామ్ ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు తొలుత ఆన్ లైన్ కొనుగోలుదారులకే అందుబాటులోకి రానుంది. దాదాపు 21 రోజుల తర్వాత, అమెజాన్.కామ్ లో విక్రయాలు జరిగిన తర్వాత కాని ఈ పుస్తకం బుక్ స్టోర్లకు రాదు. దీంతో ఆప్ లైన్ పుస్తక ప్రియులకు విడుదలైన మూడు వారాలకు గాని ఈ పుస్తకాన్ని కొనుగోలు చేసే అవకాశం రాదు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై ప్రణబ్ రాస్తున్న పుస్తకమంటే పుస్తక ప్రియులతో పాటు ఇతరులకూ ఆసక్తి ఎక్కువే కదా. ఇలాంటి పుస్తకాన్ని తొలుత ఆన్ లైన్ లో పెట్టి, ఆ తర్వాత తమ వద్దకు పంపితే ప్రయోజనమేమిటని రిటెయిల్ విక్రేతలు వాదిస్తున్నారు. అంతేకాక తమ విక్రయాలకు ఈ నిర్ణయం విఘాతం కలిగిస్తోందని బుక్ స్టోర్ల యజమానులు ఆరోపిస్తున్నారు. మరి ఈ వివాదం ఎంతదాకా వెళుతుందో చూడాలి.