: అమిత్ షాకు ప్రియాంకే జవాబు: రాహుల్ కు కాంగ్రెస్ కార్యకర్తల సూచన
కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు సోనియా కూతురు ప్రియాంకా వాద్రాకు అప్పగించాలన్న డిమాండ్లు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పలుమార్లు సూచించిన పార్టీ కార్యకర్తలు మరోమారు తమ అభీష్టాన్ని ఆయన ముందుంచారు. బుధవారం ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేరీ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంకా నినాదాలతో హోరెత్తించారు. "రాహుల్ భయ్యా, అమిత్ షా కా జవాబ్ సిర్ఫ్ ప్రియాంకా గాంధీ... ఔర్ కోయీ నహీ (రాహుల్, అమిత్ షాకు జవాబు ప్రియాంకా గాంధీనే... వేరెవ్వరూ కాదు)" అంటూ కార్యకర్తలు నినదించారు. కార్యకర్తల నుంచే కాక పార్టీ సీనియర్లు కూడా ఈ తరహా వాదనలను వినిపిస్తున్నారు. అయితే సోనియాగాంధీ కాని, రాహుల్ గాంధీ కాని ఆ దిశగా అడుగులు వేయడం లేదు. అంతేకాక ప్రియాంకా భర్త రాబర్ట్ వాద్రా అవినీతి వ్యవహారం కూడా వారిని ఆ దిశగా యోచించే సాహసం చేయనివ్వడం లేదు.