: ఆస్తి రాయలేదన్న కసితో భర్తపై కత్తి దూసిన మహిళ
ఆ భార్యాభర్తలు దాదాపు మూడు దశాబ్దాలు కలసి కాపురం చేశారు. అయితేనేం, ఆస్తి రాయడం లేదన్న కసితో భర్తపై నడిరోడ్డు మీదనే కత్తి దూసిందో మహిళ. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం వెల్దుర్తిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 60 ఏళ్ల దేవారపు లాజర్, 55 ఏళ్ల నూకాలమ్మ దంపతులకు కుమార్తె, ఇద్దరు కొడుకులు ఉన్నారు. లాజర్ పేరిట కాస్త పొలం, ఇల్లు వున్నాయి. ఆ ఆస్తిని తన బిడ్డలకు పంచాలన్నది లాజర్ అభిమతం. ఆస్తి బిడ్డలకు ఇచ్చేస్తే, తనను చూసే వారుండరని భావిస్తూ, నూకాలమ్మ కొంతకాలంగా ఆస్తిని తన పేరిట రాయమని భర్తతో గొడవపడుతోంది. వీరిద్దరి మధ్య రాజీ కుదర్చాలని పెద్దలు పంచాయితీ కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో, బుధవారం లాజర్ ను వెంటాడుతూ వచ్చిన నూకాలమ్మ మెడ మీద నరికేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనలో లాజర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితురాలిని నేడు కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు చెప్పారు.