: నేడు ప్రపంచ కప్ కు టీమిండియా ప్రాబబుల్స్ ఎంపిక... సెహ్వాగ్ కు అవకాశం దక్కేనా?
2015 వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనే టీమిండియా జట్టును బీసీసీఐ నేడు ఎంపిక చేయనుంది. ముంబైలో నేటి మధ్యాహ్నం భేటీ కానున్న సెలెక్షన్ కమిటీ 30 మందితో కూడిన ప్రాబబుల్స్ ను ఎంపిక చేయనుంది. తాను రిటైర్ కాలేదని, 2015 ప్రపంచ కప్ లో బరిలోకి దిగుతానంటూ ఇటీవల వ్యాఖ్యానించిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సహా సీనియర్లు గౌతం గంభీర్, యువరాజ్ సింగ్ ల భవితవ్యం కూడా నేడు తేలిపోనుంది. సందీప్ పాటిల్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రకటించే ప్రాబబుల్స్ జాబితాలో ఎలాంటి ఆశ్చర్యకర అంశాలు ఉండకపోవచ్చని క్రీడారంగ నిపుణులు భావిస్తున్నారు. టీమిండియా జట్టుకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సహా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీలు ప్రపంచ కప్ లో టీమిండియాను ముందుండి నడిపించనున్నారు. ఇక వీరి తర్వాత శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ తదితరుల పేర్లు బీసీసీఐ జాబితాలో ఉండే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది.