: శంఖంలో పోస్తేనే తీర్థమవుతుంది... చిరు చెబితేనే మీరు వింటారు: సిరివెన్నెల
చిరంజీవిని ముందుగా మాట్లాడమనడానికి కారణం ఏంటంటే శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందని...చిరంజీవి చెబితేనే అభిమానులు వింటారని సిరివెన్నెల అన్నారు. హైదరాబాదులోని శిల్పకళావేదికపై జరిగిన ముకుంద సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, మన కలల్లోనూ ఊహల్లోనూ అందని విషయాల గురించి శ్రీకాంత్ అడ్డాల మాట్లాడడని, మానవ సంబంధాలను స్పృశిస్తాడని అన్నారు. చేసే ముందు ఆలోచిస్తే సరిపోదా, తోచిందేదో చేసేస్తే తొందర కాదా? అని ఆయన ఈ సినిమా ద్వారా తెలిపారని అన్నారు. ఆపద్బాంధవుడు సినిమాలోని ఓ పాట ద్వారా చిరంజీవి గురించి చెప్పానని ఆయన పేర్కొన్నారు. అలాగే చిరంజీవి గురించి తాను రాసిన ఓ పాటను ఆయన గుర్తు చేశారు. చిరంజీవి పేరు చెబితేనే ఆ ప్రకంపనలు అలా వెళ్తాయని ఆయన చెప్పారు. చిరంజీవి తమ్ముడిగా కెరీర్ ఆరంభించిన పవన్ కల్యాణ్ ఈ రోజు దేశాన్ని రూపుదిద్దే వ్యక్తిగా రూపాంతరం చెందారని ఆయన చెప్పారు. చిరుతలా చిరు కుమారుడు రాంచరణ్, అల్లు అర్జున్, సాయి ధరం తేజ్ తమదైన ప్రతిభా పాటవాలతో రాణిస్తున్నారని అన్నారు. అదే కుటుంబం నుంచి మిస్సైల్ లాంటి స్టార్ వస్తున్నాడని వరుణ్ తేజ్ ని ఉద్దేశించి అన్నారు. అభిమానులు కూడా ఒక్కో స్టార్ అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.