: నా బట్టలే చిన్నవనుకుంటే అతని ఆలోచనలు అంతకన్నా చిన్నవి!: గౌహర్ ఖాన్
ముంబైలో చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుందని సినీ నటి గౌహర్ ఖాన్ ని ఓ ఆగంతుకుడు చాచిపెట్టి కొట్టిన సంఘటన గుర్తుందా? దానిపై గౌహర్ ఖాన్ స్పందించింది. తాను షూటింగ్ లో ఉండగా, అతను అలా కొడుతున్నప్పుడు చాలామంది చూశారని ఆరోపించింది. చదువుకున్నవారు మౌనంగా తమ నిరసన తెలపాలే కానీ, ఇలా దాడి చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడింది. తమ ఆలోచనలకు అనుగుణంగా ఇతరులు డ్రెస్ చేసుకోవాలని భావించడం సరికాదని ఆమె హితవు పలికింది. తాను అలాంటి డ్రెస్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేయడం లేదని, ఓ షూటింగ్ సందర్భంగా మాత్రమే అలాంటి డ్రెస్ ధరించానని గౌహర్ చెప్పింది. భారతీయ మహిళలందరికీ తాను ఒకటే చెబుతున్నానని, "మీరు ఎలా ఉన్నా తలెత్తుకుని ఉండండి" అని పిలుపునిచ్చింది. అలాగే దీనిపై ట్వీట్ చేస్తూ 'నా బట్టలే చిన్నవనుకుంటే అతని అతని ఆలోచనలు అంతకన్నా చిన్న'వని పేర్కొంది. తాను చెంప దెబ్బతిన్నట్టే అతను కూడా చెంప దెబ్బతినాలని గౌహర్ ఆకాంక్ష వ్యక్తం చేసింది. తనకు చట్టంపై గౌరవం ఉందని, అతనికి అలాంటి దెబ్బ తగులుతుందని భావిస్తున్నానని ముక్తాయించింది. గౌహర్ బాయ్ ఫ్రెండ్ కుశాల్ టండన్ సెక్యూరిటీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.