: సెంచరీ చేసిన ప్రతిసారి ఓ ఆవును కొంటానని చెప్పేవాడట!
ఆస్ట్రేలియా క్రికెట్ లో ఫిలిప్ హ్యూస్ అధ్యాయం ముగిసింది! తిరిగిరాని లోకాలకు పయనమైన ఆ యువ క్రికెటర్ బంధుమిత్రులకు, అభిమానులకు, ప్రపంచవ్యాప్త క్రికెట్ ప్రేమికులకు జ్ఞాపకాలను మాత్రం మిగిల్చాడు. స్వస్థలం మాక్స్ విల్లేలో బుధవారం అతని అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా అతడి ఫ్యామిలీ ఫ్రెండ్ కోరీ ఐర్లాండ్ మాట్లాడుతూ, హ్యూస్ కు పశువుల పెంపకం అంటే అమితాసక్తి అని తెలిపాడు. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్న తొలినాళ్లలో, సెంచరీ చేసిన ప్రతిసారి ఓ ఆవును కొంటానని చెప్పేవాడని కోరీ గుర్తు చేసుకున్నాడు. మొత్తం 600 ఆవులతో పశువుల పెంపక కేంద్రం స్థాపించి, పదేళ్లలో దాన్ని అభివృద్ధి చేయాలని తామిద్దరం ప్లాన్ కూడా చేసుకున్నామని చెప్పాడు. ఏడాదికి 200 ఎద్దులను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించాడు. తానిప్పుడు హ్యూస్ కు ప్రామిస్ చేస్తున్నానని, అతని స్వప్నాన్ని తాను సాకారం చేస్తానని ఐర్లాండ్ పేర్కొన్నాడు.