: భవిష్యత్ ఐఫోన్లలో సరికొత్త రక్షణ వ్యవస్థ... కిందపడ్డా ఏమీ కాదండోయ్!
సాధారణంగా మొబైల్స్ జారిపడితే బాగానే నష్టం జరుగుతుంది. ప్రస్తుతకాలంలో హై టెక్నాలజీతో కూడిన టచ్ స్ర్కీన్ ఫోన్ లు, అత్యాధునిక ఫీచర్లుండే ఐఫోన్ లు వాడుతున్నారు. మరి, కిందపడితే వాటి పరిస్థితేంటి? అని ఆలోచిస్తున్నారా? నికోలస్ వి కింగ్, ఫ్లెచర్ రోత్కో రూపొందించిన నూతన వ్యవస్థ అలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతుందట. పిల్లులు, ఎలుగుబంట్లు పైనుంచి కిందికి దూకే సమయంలో వీపు భాగం నేలకు ఆనేలా మధ్యలోనే శరీరాన్ని టర్న్ చేస్తాయి. ఈ వ్యవస్థ కూడా సరిగ్గా అలానే పనిచేస్తుంది. మీ ఐఫోన్ నేలపై పడేముందే, మార్గమధ్యంలోనే దానంతట అదే టర్న్ అవుతుంది. తద్వారా, సున్నితమైన భాగాలున్న వైపు ఫోన్ నేలకు తాకదు. ఫోన్ పడిన సమయంలో ప్రభావ తీవ్రతను గుర్తించి, ఫోన్ గురుత్వాకర్షణ కేంద్రాన్ని మార్చి సున్నిత భాగాలను రక్షిస్తుందట ఈ వ్యవస్థ. ఫోన్ లో ఆ వ్యవస్థను అమర్చితే, ఫోన్ కిందపడేటప్పుడు ఏ దిశలో ల్యాండవ్వాలనేది అదే ఎంచుకుంటుందట. ఈ 'భవిష్యత్ ఐఫోన్ రక్షణ వ్యవస్థ'పై పేటెంట్ ఐఫోన్ తయారీదారు యాపిల్ కు మంజూరయిందట.