: గూగుల్ హోటల్... ఫేస్ బుక్ ఛాట్ భండార్!
భారతీయులు సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఎంత విరివిగా ఉపయోగిస్తారో తెలిసిందే. ఆ విపరీత వినియోగాన్ని ఓ వెర్రి కింద కొట్టిపారేసేవారూ లేకపోలేదు. అంతలా పెనవేసుకుపోయింది సోషల్ మీడియా. వెర్రికి నిదర్శనమా అన్నట్టుగా... కర్ణాటకలోని బీజాపూర్లో రహదారి పక్కనే 'గూగుల్' పేరుతో హోటల్ కనిపిస్తుంది, మరో చోట 'ఫేస్ బుక్ చాట్ వాలా' అంటూ పానీ పూరీ బండి దర్శనమిస్తుంది. ఫేస్ బుక్ లోగోకు అనుకరణంగా ఫేస్ లుక్ బ్యూటీపార్లర్ నూ చూడొచ్చు. మరో ప్రాంతంలో అయితే, ఓ పూజా మంటపాన్ని సైతం ఫేస్ బుక్ హోమ్ పేజీ తరహాలో డిజైన్ చేయడం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. అన్నింటికి మించి, మగువలు కట్టే చీరలు కూడా ఫేస్ బుక్, వాట్సాప్ లోగోలతో వస్తున్నాయి. సోనీ చానల్లో ప్రసారమయ్యే 'సీఐడీ' సీరియల్ చాలామందికి తెలిసే ఉంటుంది. దాంట్లో, 'కూగుల్' అంటూ కొత్త సెర్చ్ ఇంజిన్ ను పరిచయం చేస్తారు. బహుశా వారు గూగుల్ నుంచి స్ఫూర్తి పొంది ఉంటారేమో!