: మోదీ మోడల్ విలేజ్ పథకానికి మమత తూట్లు!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సంసద్ ఆదర్శ గ్రామ యోజన (మోడల్ విలేజ్)కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తూట్లు పొడుస్తున్నారు. మోడల్ విలేజ్ పథకం కింద ఒక్కో ఎంపీ తన నియోజకవర్గంలోని ఓ గ్రామాన్ని ఎంచుకుని ఏడాదిలోగా దానిని అన్ని రంగాల్లో అభివృద్ధి బాట పట్టించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఇప్పటికే గ్రామాలను ఎంపిక చేసుకోవడంతో పాటు ఆయా గ్రామాల్లో పనులు కూడా మొదలెట్టారు. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికొస్తే, రాష్ట్రంలో మొత్తం 42 మంది లోక్ సభ, 16 మంది రాజ్యసభ సభ్యులున్నారు. వీరిలో ఇప్పటిదాకా కేవలం ఇద్దరంటే ఇద్దరు ఎంపీలు మాత్రమే తమ ఆదర్శ గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. మిగిలిన వారు అసలు ఆ పథకంపై దృష్టి సారించిన పాపాన పోలేదు. విషయమేంటని ఆరా తీస్తే... బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో ఆ పథకాన్ని అంతగా పట్టించుకోవద్దని తన రాష్ట్ర ఎంపీలకు మమత సూచించారట. అయితే మోదీ ‘ఆదర్శం’ పశ్చిమ బెంగాల్ లో పడకేసినట్లేనన్నమాట.