: మావో దాడులు రమణ్ సింగ్ కుర్చీకే ఎసరు తెచ్చాయా?
ఛత్తీస్ గఢ్ లో నానాటికీ పెరిగిపోతున్న మావోయిస్టు దాడులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పదవిని ఊడగొట్టేలా ఉన్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో మావోలు పేట్రేగిపోతున్నారు. వారిని అణచివేయడంలో రమణ్ సింగ్ సర్కారు ఘోరంగా విఫలమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయనను సీఎం పీఠం నుంచి దించేందుకు బీజేపీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తాజా దాడి నేపథ్యంలో పార్లమెంటులోనూ విపక్షాలు రమణ్ సింగ్ పనితీరుపై విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 10న ఛత్తీస్ గఢ్ వెళుతున్నారు. తన పర్యటనలో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలతో అమిత్ షా భేటీ కానున్నారు. రమణ్ సింగ్ సర్కారుపై వారి అభిప్రాయాలను కూడా ఆయన అడిగి తెలుసుకోనున్నారు. "ఇప్పటికిప్పుడు రమణ్ సింగ్ కు వచ్చిన ముప్పేమీ లేదు. అయితే మావోల దాడులను అరికట్టలేని రమణ్ సింగ్ మాత్రం మూల్యం చెల్లించుకోకతప్పదు" అని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.