: కేంద్ర మంత్రి సాధ్వి వ్యాఖ్యలపై రెండో రోజూ పెద్దల సభలో రగడ... సభ వాయిదా
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి చేసిన అనుచిత వ్యాఖ్యలపై వరుసగా రెండో రోజు బుధవారం కూడా రాజ్యసభలో విపక్షాలు నిరసనకు దిగాయి. మంత్రి తరఫున ప్రధాని రాజ్యసభకు వచ్చి ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు రెండో రోజు తమ వాదనను కొనసాగించారు. అయితే సంబంధిత మంత్రే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటనను విపక్షాలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని పదవిలో ఉండగా, మన్మోహన్ సింగ్ కూడా సాక్షాత్తు సభలో ములాయం సింగ్ యాదవ్ ను ఉగ్రవాదిగా అభివర్ణించిన వైనాన్ని వెంకయ్య లేవనెత్తారు. దీంతో సభలో విపక్ష సభ్యులు ఒక్కసారిగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో కేవీపీ, వీహెచ్ లు ఆందోళనల్లో ముందువరుసలో నిలిచారు. సంయమనం పాటించాలన్న తన అభ్యర్థనను సభ్యులు పట్టించుకోకపోవడంతో ఉపాధ్యక్షుడు కురియన్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.