: 2000 మంది వేధించారు... అవకాశం దొరికితే బాదేశాం: రోహ్ తక్ సిస్టర్స్
"నా వయసు 19 ఏళ్లు. నా జీవితకాలంలో ఇప్పటివరకూ 2000 మందికి పైగా వివిధ రీతుల్లో నన్ను వేధించారు. అవకాశం దొరికినప్పుడల్లా నేను తిరగబడ్డాను" అంటోంది పూజా. బస్సులో తమను వేధింపులకు గురిచేసిన వారిని ధైర్యంగా ఎదిరించి ఒక్కరోజులో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న రోహ్ తక్ సిస్టర్స్ లో చిన్నదైన పూజా తన అక్క ఆర్తి (22)తో కలసి ఇలా ఆకతాయిలకు పలుమార్లు బుద్ధి చెప్పిందట. భవిష్యత్తులో మరిన్ని వీడియోలు రావచ్చని కూడా అంటోంది. తాజాగా, ఓ పార్కులో యువకుడిపై ఈ సిస్టర్స్ ఫైటింగ్ చేస్తున్న వీడియో వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీన్ని ఎవరు చిత్రీకరించారో తనకు తెలియదని, ఈ ఘటన నెల క్రితం జరిగిందని పూజా చెప్పింది. అసలు ఈ అక్కాచెల్లెళ్ళు తిరగబడుతున్నప్పుడు మాత్రమే వీడియోలు తీస్తుండటంపై కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పోలీసులు ఈ దిశగా కూడా విచారిస్తున్నారని సమాచారం. ఏదెలా ఉన్నా, వీరి ధైర్యానికి ప్రశంసలు మాత్రం బాగానే వచ్చాయి. హర్యానా ప్రభుత్వం నగదు బహుమతి కూడా ప్రకటించింది.