: 'నాకే క్లాస్ పీకుతారా...' అంటూ టీచర్ని లాగి కొట్టాడు!
విద్యార్థిని టీచర్ దండించాడని తెలియగానే విద్యార్థి బంధువులు స్కూల్ పై దాడికి దిగడం, మీడియా వాళ్లు సదరు టీచర్ ప్రపంచాన్ని నాశనం చేశారన్న స్థాయిలో కథనాలు ప్రసారం చేస్తున్న ఘటనలు తరచు చూస్తున్నాం. అయితే, ఇటీవల విద్యార్థులు టీచర్లపై చేయిచేసుకుంటున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. అల్లరి చేశాడని మందలించినందుకు ఓ టీచర్ పై విద్యార్థి చేయిచేసుకున్న సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. చెన్నైలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ క్లాస్ జరుగుతుండగా, ఆ పోకిరీ విద్యార్థి మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో, టీచర్ అలా చేయడం సరికాదని మందలించింది. స్టూడెంట్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 'నాకే క్లాస్ పీకుతారా?' అంటూ లాగిపెట్టి గూబమీద ఒక్కటిచ్చాడు. దీంతో, టీచర్ కి దిమ్మతిరిగింది. మొత్తం వ్యవహారాన్ని జిల్లా విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థి భవిష్యత్ దృష్ట్యా దీనిపై టీచర్ పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయలేదు. టీచర్ ఎడమ చెవి లోపలి కండరాలకు ఏమైనా దెబ్బతగిలిందేమోనని ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.