: చెన్నై నుంచి ఎర్రచందనం కూలీలను తరలిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు
ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంతవరకు లారీలు, ఇతర వాహనాల ద్వారా స్మగ్లింగ్ జరుగుతుండటంతో ఎక్కడికక్కడ పోలీసులు పట్టుకుంటున్నారు. దాంతో, ఆర్టీసీ డ్ర్రైవర్లతో బస్సుల ద్వారా ఎర్రచందనం కూలీలను చెన్నై నుంచి కడపకు తరలిస్తున్నారని జిల్లా ఎస్పీ నవీన్ గులాటీ తెలిపారు. ఈ విషయం తెలుసుకుని 11 మంది ఆర్టీసీ డ్రైవర్లను అరెస్టు చేసినట్టు చెప్పారు. కాగా, తమిళ కూలీల కోసం బస్సులను డ్రైవర్లు ఖాళీగా ఉంచుతున్నారని, చెన్నైలోని కోయంబేడు నుంచి కూలీలను తరలిస్తున్నారని వివరించారు. చెన్నై నుంచి రైల్వేకోడూరు వరకు తమిళ కూలీల తరలింపు జరుగుతుందని, అదీ నంద్యాల డిపో డ్రైవర్ అక్బర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఇదంతా జోరుగా సాగుతోందని వెల్లడించారు. నెలలో ఐదుసార్లు ఆర్టీసీ డ్రైవర్లు కూలీలను తరలిస్తున్నారని, వారిపై చర్యల కోసం రవాణాశాఖకు సమాచారం అందజేశామన్నారు. మరోవైపు కడపలో రూ.3.30 లక్షల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.