: ప్రపంచం మోదీ వైపు చూస్తోంది: కిషన్ రెడ్డి
ప్రపంచ దేశాలు భారత ప్రధాని నరేంద్ర మోదీ వైపు చూస్తున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పదేళ్ల పాలనలో దేశ ప్రతిష్ఠను కాంగ్రెస్ పార్టీ మంటగలిపిందని ధ్వజమెత్తిన ఆయన మోదీ రాకతో ప్రపంచం భారత్ వైపు ఆసక్తిగా చూస్తోందన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పార్టీ సభ్యత్వ నమోదును కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యూపీఏ పాలనపై విరుచుకుపడ్డ ఆయన, మోదీ ఆధ్వర్యంలో భారత్ వెలిగిపోతున్న తీరును ప్రస్తావించారు. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాకు దీటుగా భారత్ ను అభివృద్ధి చేసే బాధ్యతను మోదీ తన భుజాలకెత్తుకున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ఈ తరహా సాహసాన్ని ఏ ఒక్క ప్రధాని కూడా చేయలేకపోయారన్నారు. మోదీ హయాంతో భారత్, ప్రపంచ దేశాలు గర్వించే స్థాయికి ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ సత్యాన్ని తెలుసుకున్నందునే అమెరికా కూడా మోదీకి బ్రహ్మరథం పట్టిందన్నారు. భవిష్యత్తులో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవడమే కాక ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ ఎదుగుతుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.