: ట్రాఫిక్ లో చిక్కుకున్న కేంద్రమంత్రి... కారు వదిలి మెట్రో రైలులో ప్రయాణం
నగరాల్లో అంతకంతకూ పెరుగుతున్న వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ అయితే ఎప్పటికి క్లియర్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఢిల్లీ, ముంబయి లాంటి మహానగరాల్లో అయితే ఈ బాధలు మరీ ఎక్కువ. తాజాగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుని నానా తిప్పలు పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, నిన్న ఢిల్లీలో గడ్కరీ ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో స్థానిక దౌలాకోన్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. కేంద్రమంత్రి కావడంతో, ఆయనకు చాలా కార్యక్రమాలు ఉంటాయి. ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు రోడ్డు మీదే వెయిట్ చేయాలంటే అవతల పనులు ఆగిపోతాయి. దీంతో, విధిలేని పరిస్థితుల్లో ఆయన తన కారు దిగి, పక్కనే ఉన్న మెట్రో స్టేషన్ కు చేరుకుని, మెట్రో రైలు ఎక్కారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో ట్రాఫిక్ బాధలను తీర్చేందుకు రూ. 4700 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు.