: మోదీ నివాసంలో నేడు కీలక భేటీ... సీబీఐ కొత్త చీఫ్ ఎంపిక


ప్రధాని నరేంద్ర మోదీ అధికార నివాసంలో నేడు కీలక భేటీ జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గేలు హాజరుకానున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు కొత్త చీఫ్ ను ఎంపిక చేసేందుకే ఈ భేటీ జరుగుతోంది. సీబీఐ డైరెక్టర్ గా కొనసాగుతున్న రంజిత్ సిన్హా పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు తక్షణమే కొత్త చీఫ్ ను నియమించాల్సి ఉంది. ఇప్పటికే పలువురు సీనియర్ పోలీసు అధికారుల జాబితాను కేంద్రం పరిశీలించింది. నేటి భేటీలో ప్రధాని నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సీబీఐ చీఫ్ ను ఎంపిక చేయనుంది. సీబీఐ చీఫ్ ఎంపిక కోసం లోక్ పాల్ చట్టంలో పేర్కొన్న మాదిరిగా ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, లోక్ సభలో ప్రతిపక్ష నేత (ప్రస్తుతం విపక్షాల్లోని అతిపెద్ద పార్టీ నేత)లతో కూడిన కమిటీ తొలిసారి రంగంలోకి దిగనుంది. ఇప్పటిదాకా సీబీఐ చీఫ్ ను కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ఆధ్వర్యంలోని కమిటీ సిఫారసు మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ నియమించేది. తాజాగా మోదీ సర్కారు లోక్ పాల్ చట్టం ఆధారంగా ఆ సంస్థ అధిపతిని ఎంపిక చేసేందుకు తీర్మానించింది. పలు కీలక కేసులను దర్యాప్తు చేస్తున్న సీబీఐ పగ్గాలు ఎవరికి దక్కుతాయోనన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News