: నేటి నుంచి మావోల వారోత్సవాలు... ఏవోబీలో టెన్షన్!


మావోయిస్టుల వారోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వారోత్సవాల నేపథ్యంలోనే మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ లో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేసి 13 మందిని పొట్టనబెట్టుకుని తమ ప్రాబల్యాన్ని చాటుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాక రాష్ట్ర విభజన నేపథ్యంలో తొలిసారి జరుగుతున్న వారోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మావోల పోస్టర్లతో పాటు బ్యానర్లు కూడా వెలిశాయి. అంతేకాక, ఇటీవల ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఛత్తీస్ గఢ్ పోలీసులు నిర్మించతలపెట్టిన పోలీస్ ఔట్ పోస్టుకు ఇసుక తీసుకెళుతున్న లారీని మావోలు కాల్చివేశారు. అతి సమీపంలోనే చుట్టూ పోలీసు బలగాలున్నా ఏమాత్రం భయపడని మావోయిస్టులు, దాదాపు అరగంట పాటు అక్కడ హల్ చల్ చేశారు. కోల్పోయిన ప్రాభవాన్ని పునరుద్ధరించుకునేందుకు మావోలు ఈ వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుండగా, మావోల ఎదుగుదలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులు వ్యూహాలు పన్నుతున్నారు. వారోత్సవాల నేపథ్యంలో ఏవోబీలో పోలీసుల కూంబింగ్ మరింత పెరిగింది.

  • Loading...

More Telugu News