: ఐసీసీ గ్లోబల్ పార్ట్ నర్ గా ఎంఆర్ఎఫ్ టైర్స్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గ్లోబల్ పార్ట్ నర్ గా ఎంఆర్ఎఫ్ టైర్స్ సంస్థ అవకాశం దక్కించుకుంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల సంయుక్త నిర్వహణలో జరిగే వరల్డ్ కప్ కు ఈ ఒప్పందం వర్తిస్తుంది. చెన్నైలో నేడు జరిగిన ఐసీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ మాట్లాడుతూ, గ్లోబల్ పార్ట్ నర్ గా ఎంఆర్ఎఫ్ ను ఆహ్వానించేందుకు సంతోషిస్తున్నామని పేర్కొన్నారు. క్రికెట్ కు విశేష ప్రచారం కల్పించే సంస్థల్లో ఎంఆర్ఎఫ్ ప్రముఖమైనదని అన్నారు. అటు, ఎంఆర్ఎఫ్ చైర్మన్-మేనేజింగ్ డైరక్టర్ కేఎం మమ్మెన్ మాట్లాడుతూ, ఇది చారిత్రిక ఘట్టమని పేర్కొన్నారు. 2015 వన్డే వరల్డ్ కప్ లో భాగస్వాములమవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. టైర్లు, రబ్బర్ ఉత్పత్తుల సంస్థగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎంఆర్ఎఫ్ ఎన్నో ఏళ్లుగా క్రికెట్ తో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. చెన్నైలో ఎంఆర్ఆఫ్ సంస్థ పేస్ ఫౌండేషన్ నెలకొల్పి, భారత్ లోని యువ పేసర్లను సానబడుతుండడం తెలిసిందే.