: విమానంలో పందిపిల్ల పరుగులు!
అమెరికాలో ఓ మహిళ పందిపిల్లతో విమానమెక్కింది. కనెక్టికట్ లోని బ్రాడ్లే ఎయిర్ పోర్టులో ఈ ఉదంతం చోటుచేసుకుంది. బుధవారం నాడు ఓ మహిళ ఓ మోస్తరు బ్యాగుతో యూఎస్ ఎయిర్ వేస్ విమానమెక్కింది. దాంట్లో ఓ పందిపిల్ల ఉంది. ఆమె సరాసరి వెళ్లి, మసాచుసెట్స్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జోనాథన్ స్కోల్నిక్ పక్క సీట్లో కూర్చుంది. అయితే, బ్యాగులోని పందిపిల్ల తన సహజ స్వభావ రీత్యా గుర్ గుర్ మంటూ అరుపులు మొదలు పెట్టింది. అంతటితో ఊరుకోకుండా, బ్యాగులోంచి బయటపడి విమానంలో అటూ ఇటూ పరుగులు పెట్టింది. దీంతో, విమాన సిబ్బంది స్పందించారు. పందిపిల్ల నియంత్రణ కోల్పోయిందని, ఆమె వెంటనే దాన్ని తీసుకుని వెళ్లిపోవాలని సూచించారు. దీంతో, ఆ ప్రయాణికురాలు తన పందిపిల్లను తీసుకుని విమానం దిగిపోయింది. అమెరికా విమాన రవాణా చట్టం ప్రకారం జంతువులు ఇబ్బంది కలిగించనంత వరకు వాటిని విమానాల్లో రవాణా చేయడానికి అనుమతిస్తారని యూఎస్ ఎయిర్ వేస్ ప్రతినిధి లారా మాస్విడాల్ తెలిపారు.