: సంవత్సరం క్రితం రూ. 83... ఇప్పుడు రూ. 69... ఎంత తగ్గినా ఆనందమే!


సంవత్సరం వ్యవధిలో పెట్రోల్ ధర లీటరుకు దాదాపు రూ.14 తగ్గింది. ఇంకా తగ్గుతుందని విశ్లేషకులు అంటున్నారు. సామాన్య ప్రజలకు పెట్రోల్ రేటు ఎంత తగ్గినా ఆనందమే. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ట్రేడింగ్ పై ఆధారపడి మారుతుంటాయి. 2008-09 సమయంలో ప్రపంచ దేశాలను ఆర్థిక మాంద్యం చుట్టుముట్టినప్పుడు క్రూడాయిల్ ధరలు బ్యారెల్ కు 35 డాలర్ల వరకు దిగజారాయి. ఆ సమయంలో ఇండియాలో పెట్రోల్ ధర లీటరుకు రూ.50 దిగువకు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ తరువాత మెల్లగా మాంద్యం ఛాయలు తొలగిపోగా క్రూడాయిల్ ధర సైతం 135 డాలర్ల వరకూ పెరిగింది. ఆ సమయంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.200 వరకూ ఉండాల్సింది. అయితే దేశంలో ధరల నియంత్రణ ఉండబట్టి ఆ భారం సబ్సిడీ రూపంలో ప్రభుత్వ ఖజానాపై పడింది. ఆ తరువాత పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణ తొలగిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ మార్కెట్ సరళిని అనుసరించి ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వరంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తుంటాయి. ఈ సంగతి అలా ఉంచితే దేశ ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత 8 సార్లు పెట్రోల్ ధరలు తగ్గాయి. వాస్తవానికి ఈ విషయంలో మోదీ చేసిందేమీ లేకున్నా ఓ సంవత్సరం క్రితం రూ.83 వద్ద ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు రూ.69 కి చేరింది. చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల మధ్య కొనసాగుతున్న విభేదాలే క్రూడాయిల్ ధరల పతనానికి కారణం. ఈ విభేదాలు కొనసాగి మరోసారి 35 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర వస్తే... పెట్రోల్ రేటు రూ.32 వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News