: దళ సభ్యులను రక్షించుకోవడమెలా?: మావోయిస్టు చీఫ్ గణపతి అంతర్మథనం!
మావోయిస్టు దళపతి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి...దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన, తెలుగు రాష్ట్రాలకే కాక మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ తదితర మావో ప్రభావిత రాష్ట్రాలతో పాటు కేంద్రానికి కూడా కొరకరాని కొయ్యగా తయారయ్యారు. గణపతి ఆచూకీ చెబితే చాలు రూ2.5 కోట్లు ఇస్తామంటూ ఆయా ప్రభుత్వాలు నజరానా ప్రకటించాయి. ఆ తరహాలో ప్రభుత్వాలను వణికిస్తున్న గణపతి, తాజాగా ఆత్మరక్షణలో పడిపోయారట. మావోయిస్టు ఉద్యమాన్ని పరిరక్షించుకోవడంతో పాటు కేడర్ ప్రాణాలను కాపాడే దిశగా ఆయన చర్యలు ప్రారంభించారు. నమ్మశక్యం కాకున్నా, ఇది ముమ్మాటికీ నిజమంటున్నాయి నిఘా వర్గాలు. ఎందుకంటే, మావోయిస్టు పదో ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సంస్థ రూపొందించిన ఓ పుస్తకంలో ఈ విషయాలను గణపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ఏ డికేడ్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ శాక్రిఫైస్’ పేరిట రూపొందిన ఈ పుస్తకంలో... ఉద్యమంతో పాటు దళాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను గణపతి ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘ఇప్పటిదాకా 1,500 మంది దళ సభ్యులను కోల్పోయాం. ఇకనైనా జాగ్రత్త పడకపోతే ఉద్యమం ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది’’ అని ఆయన తన ఆందోళనను వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విరుచుకుపడుతున్న సర్కారీ బలగాల ముందు నిలబడలేకపోతున్న వైనాన్ని కూడా ఆయన అందులో ఏకరువు పెట్టారు. ఆ తరహా ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంలో సతమతమవుతున్న పార్టీ, కనీసం దళ సభ్యులనైనా రక్షించుకోకపోతే, భవిష్యత్తులో కనుమరుగు కావడం ఖాయమేనని గణపతి భయపడుతున్నట్టు ఆ కథనం వెల్లడిస్తోందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.