: ప్రవాస భారతీయులకు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల వల: ఇంటెలిజెన్స్ చీఫ్
విదేశాల్లో ఉంటున్న భారతీయులపై ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు వల వేస్తున్నాయి. భారత్ లోని ముస్లిం యువతను ఆకట్టుకునే క్రమంలో విఫలమైన ఆ సంస్థలు, తాజాగా విదేశాల్లో నివసిస్తున్న భారత జాతీయులపై కన్నేశాయని ఇంటెలిజెన్స్ చీఫ్ ఆసిఫ్ ఇబ్రహీం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆదివారం గౌహతిలో జరిగిన డీజీపీల సదస్సు సందర్భంగా ఇబ్రహీం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు ఇసిస్, ఆల్ ఖైదాలు ఈ తరహా యత్నాలను మరింత ముమ్మరం చేశాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లామిక్ తీవ్రవాదుల చర్యలు, సిద్ధాంతాలను భారత్ లోని ముస్లిం సంస్థలు, మత పెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైనాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సదరు ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను ప్రశ్నించడంతో పాటు ఆయా సంస్థలు అవలంబిస్తున్న చర్యలు కూడా ఇస్లామిక్ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయని భారత ముస్లింలు బాహాటంగానే ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్రవాద సంస్థలు తమ బలాన్ని పెంచుకునే విషయంలో భారత్ పై ఆశలు వదులుకున్నాయని ఆయన చెప్పారు. ఉగ్రవాద సంస్థల వైపు మళ్లుతున్న ప్రవాస భారతీయుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దీనిని కట్టడి చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కూడా ఆయన సూచించారు.