: సామాన్యుని చెంతకు దిగొస్తున్న బంగారం
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల పతనం మరింత కాలం పాటు కొనసాగేట్టు కనిపిస్తోంది. ఒక వైపు ముడి చమురు ధరలు ఐదేళ్ళ కనిష్ఠ స్థాయికి పడిపోగా, మరోవైపు లోహాల ధరలు కూడా అదే దారిలో సాగుతున్నాయి. సోమవారం నాటి ఇంటర్నేషనల్ మార్కెట్ సెషన్లో ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర 1,442.90 డాలర్ల (సుమారు రూ.70,825) వద్ద కొనసాగింది. అంటే పది గ్రాముల బంగారం ధర 23,530 రూపాయలకు చేరింది. వాస్తవానికి దేశవాళీ మార్కెట్లో నేడు 25,300 రూపాయల వద్ద (ఉదయం 10:30 గంటల సమయంలో) ట్రేడ్ అవుతోంది. త్వరలోనే మరో 2 వేల రూపాయల వరకు బంగారం ధర తగ్గే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ ట్రేడింగ్ తో పోలిస్తే దిగుమతి సుంకాలు, ఇతర పన్నులు, మార్కెట్ కమిషన్లు వగైరాలు బంగారం స్పాట్ రేటుకు కలపాల్సి ఉంటుంది. తాజాగా బంగారం నిల్వలను పెంచుకోవాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఈ ప్రభావం కనీసం వారం రోజుల పాటు బులియన్ మార్కెట్ మీద ఉంటుందని అంచనా.