: ఢిల్లీ విందుతో రూ.50 లక్షలు రాబట్టిన కేజ్రీవాల్


పార్టీ విరాళాల కోసం ప్రత్యేక విందులను ఏర్పాటు చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భారీ ఎత్తున నిధులను రాబడుతున్నారు. మొన్నటికి మొన్న ముంబైలో ఏర్పాటు చేసిన డిన్నర్ ద్వారా రూ. 91 లక్షలను రాబట్టిన కేజ్రీవాల్, తాజాగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన లంచ్ విందుతో మరో రూ.50 లక్షలను పార్టీ నిధికి జమ చేశారు. మొత్తం 125 మంది వ్యాపారవేత్తలు ఈ విందులో పాలుపంచుకున్నారు. విందులో పాల్గొనే వ్యక్తి, పార్టీ ఫండ్ కింద రూ. 20 వేలను ఇవ్వాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గతంలోనూ ఇదే తరహాలో ఆయన భారీ ఎత్తున నిధులను పోగేశారు. ఆ నిధులతోనే ఆయన పార్టీ మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహించుకుంది. తాజాగా ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ మరోమారు తన విందు రాజకీయాలకు తెరతీశారు. ఢిల్లీ విందు సందర్భంగా వ్యాట్ ను క్రమబద్ధీకరిస్తానని వ్యాపారులకు కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News