: బాబు సర్కారుతో సఖ్యతగా ఉంటే కరెంటిప్పిస్తాం: కేసీఆర్ ప్రభుత్వానికి ఎర్రబెల్లి ఆఫర్
చంద్రబాబునాయుడు ప్రభుత్వంతో సఖ్యతగా మెలిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి కరెంటిప్పిస్తామని కేసీఆర్ సర్కారుకు తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర రావు బంపర్ ఆఫరిచ్చారు. తెలంగాణ కంటే ఏపీ ఎక్కువ విద్యుత్ వాడుకుంటే అఖిలపక్షం వేసి నిగ్గుతేల్చాలన్న ఆయన, అధికంగా వాడుకున్న విద్యుత్ ను ఏపీ నుంచి తిరిగి ఇప్పిస్తామని కూడా అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా దేవరుప్పలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం సందర్భంగా ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. "కేంద్రంతో పాటు పొరుగు రాష్ట్రాలతోనూ కేసీఆర్ సఖ్యతగా ఉండటం లేదు. అందువల్లే విద్యుత్ ను రాబట్టే విషయంలో ఆయన విఫలమయ్యారు. నిధులు లేకున్నా పొరుగు రాష్ట్రం ఏపీ అభివృద్ధి బాాటలో నడుస్తోంది కదా. దానిని చూసి కేసీఆర్ నేర్చుకోవాలి. కరెంటు కోసం మూడేళ్లు ఆగాల్సిన పనిలేదు. ఏపీ వద్ద మిగులు విద్యుత్ ఉంది. చంద్రబాబు సర్కారుతో కేసీఆర్ సఖ్యతగా ఉంటే, మూడు నెలల్లోనే వెయ్యి మెగావాట్ల విద్యుత్ ను ఇప్పిస్తాం" అని ఎర్రబెల్లి అన్నారు.